మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుంది..రాకుంటే రాజకీయాలు వదిలేస్త: మంత్రి వెంకట్​రెడ్డి  

మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుంది..రాకుంటే రాజకీయాలు వదిలేస్త: మంత్రి వెంకట్​రెడ్డి  
  • బీఆర్ఎస్ రాకుంటే వదిలేస్తవాఅని కేటీఆర్​కు సవాల్

నల్గొండ, వెలుగు: కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఆధికారంలోకి వస్తుందని, అధికారంలోకి రాని పక్షంలో రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే కేటీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. సోమవారం నల్గొండ జిల్లా అర్జాలబావిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ  కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

కేటీఆర్ కు ఎస్ఎల్బీసీ ఎక్కడుందో తెలియదని, ఆయన నోరు అదుపులో పెట్టుకోని మాట్లాడాలన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ఆ పార్టీ తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. పదేండ్లు నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయకుండా అన్యాయం చేశారన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తయి జిల్లా సస్యశ్యామలం అవుతుందనుకునే సమయంలో ఎవరి దిష్టి తగిలిందో గాని.. టన్నెల్ కూలిపోయి ఎనిమిదిమంది చనిపోయారన్నారు.

ఎస్ఎల్బీసీలో ప్రమాదం బాధాకరమని.. ఎట్టి పరిస్థితుల్లో టన్నెల్ పూర్తి చేసి తీరుతామన్నారు. గత సీజన్ లో ధాన్యం సేకరణలో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తైన రెండు, మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని స్పష్టం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టే మిల్లులు సీజ్ చేయిస్తామని, అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.